Ticker

6/recent/ticker-posts

జెకర్యా చేసిన ప్రార్ధన


 జెకర్యా చేసిన ప్రార్ధన

అప్పుడా దూత అతనితో జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. లూకా 1:13

జెకర్యా యాజకుడు అతని భార్య ఎలీసబెతు వీరిద్దరు ప్రభువుయొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వీరికి సంతానము లేక బహుకాలము గడచిన వృద్ధులు.

అయితే, జెకార్యా సంతానము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్ధిస్తూనే వున్నాడు. వివాహమయిన సమయం నుండి వృద్ధాప్యము వరకు ప్రార్ధిస్తూనే వున్నాడు. ఎన్ని సంవత్సరాలు అట్లా ప్రార్ధించాడో కూడా తెలియదు. మొత్తానికి అతని ప్రార్ధన పరీక్షకు నిలబడగలిగి దేవుని దగ్గర నుండి స్పష్ట మైన సమాధానాన్ని తీసుకు రాగలిగింది.

దేవుని దూతే ప్రత్యక్షంగా స్పష్టమైన వాగ్ధానాన్ని తీసుకొచ్చాడు. అది ఎంత స్పష్టమైనది అంటే? పుట్టబోయే బిడ్డకు పెట్టవలసిన పేరును కూడా తెలియజేసాడు. అతని పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో? ముందుగానే స్పష్టముగా తెలియజేసాడు.

కానీ ఈ జెకర్యా యొక్క ప్రార్థన దేవుడు సమాధానం ఇవ్వబోతున్న ఏకైక ప్రార్థన కాదు. ఇజ్రాయెల్ కోసం ఓదార్పు కోసం సిమియోన్ ప్రార్థన (లూకా 2:25), ఇజ్రాయెల్ యొక్క విముక్తి కోసం అన్నా ప్రార్థన (లూకా 2:38), మరియు పాత వాగ్దానాలను నెరవేర్చడానికి మెస్సీయ కోసం లెక్కలేనన్ని ప్రార్థనలు ఉన్నాయి. దేవుడు ఈ ప్రార్థనలన్నింటికీ ప్రతిస్పందించబోతున్నాడు!

జెకర్యా ఆత్మీయంగా బలవంతుడైనప్పటికీ అతని శారీరిక స్థితి (వృద్ధాప్యం) దేవుని వాగ్ధానమును నమ్మకుండా అడ్డుపడింది. ఫలితంగా ఆ బిడ్డ పుట్టేవరకు మూగవాడయ్యాడు.ఏది ఏమయినా, అతని ప్రార్ధనా ఫలితంగా గొప్ప ఆశీర్వాదకరమైన కుమారుడు వారి గర్భాన జన్మించాడు. అతడెంత గొప్పవాడో యేసు ప్రభువువారే సాక్ష్య మిచ్చారు.

స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. మత్తయి 11:11

 అవును! అనేక సందర్భాలలో మన చుట్టూనున్న పరిస్థితులు చూచి, మన ప్రార్థనకు సమాధానం వస్తుంది అనే నమ్మకాన్ని కోల్పోతాము. అయితే, మనము సమస్యను కాదు చూడాల్సింది, ఆ సమస్యను పరిష్కరించే దేవుని వైపు చూడాలి. నీవు చేసే ప్రార్ధన వ్యర్థంకాదు. తప్పక ప్రతిఫలాన్ని తీసుకువస్తుంది. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తాడేమో గాని, అలక్ష్యం మాత్రం చెయ్యడు. ఆ ఆలస్యంలో కూడా శ్రేష్టమైన మేలును దాచివుంచుతాడు.

ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

ఆమెన్... 

Smug Christ 8341543434...

Post a Comment

1 Comments