Ticker

6/recent/ticker-posts

ఉన్నత జీవితము జీవించిన యోబు

యోబు గ్రంథము 26 నుండి 31 అధ్యాయములలో ఇతరుల మేలుకొరకు యోబు చెప్పుచున్నాడు. ఈ అధ్యాయములను మనము చదువుచుండగా, బైబిలులేని ఆదినములలో మరియు పరిశుద్ధాత్మతో నింపబడకపోయినప్పటికీ, దేవునిగూర్చి మరియు ఆయన మార్గములనుగూర్చి యోబుకున్న వెలుగు (ప్రత్యక్షత) మరియు ఆయన యొక్క ఉన్నతమైన జీవితము ఎంతో ఆశ్చర్యకరమైనది. ఈ దినములలో మనము బుద్ధి తెచ్చుకొని మరియు ఉన్నతమైన జీవితము జీవించుటకు సవాలు చేయబడు నిమిత్తము ఈ అధ్యాయములలోని కొన్ని సంగతులు చదువుట మంచిది.

జ్ఞానమునకు వెదుకక బంగారము కొరకు లోతుగా త్రవ్వు మనుష్యుడు ఎంతో బుద్ధిహీనుడని చెప్పుచూ ఆరంభించుచున్నాడు (యోబు 27:1,12,13). ''యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు మరియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు'' (28:28) ఆయన చెప్పుచున్నాడు. సామెతలు 9:10లో ఇదే విషయమును 1000 సంవత్సరముల తరువాత సొలొమోను చెప్పుచున్నాడు. ఇటువంటి గ్రహింపును అతడు నిశ్చయముగా యోబు గ్రంథమునుండి పొందియుండును.

29వ అధ్యాయములో గతములో తాను దేవుని స్నేహితుడుగా ఏవిధముగా జీవించెనో, బీదలకు, దిక్కులేనివారికి, విధవరాండ్రకు, గ్రుడ్డివారికి, కుంటివారికి మరియు అవసరములో ఉన్నవారికి సహాయము చేసినట్లుగా చెప్పుచున్నాడు. 30వ అధ్యాయములో ఇన్ని మంచిక్రియలు చేసినప్పటికీ, ఇప్పుడు శ్రమపడుచు మరియు దేవునిచేత తగ్గించబడుటను గూర్చి ఫిర్యాదు చేయుచున్నాడు.

31వ అధ్యాయములో తన జీవితములో ఉన్న నీతిని గూర్చి చెప్పుచున్నాడు. స్త్రీలను మోహపుచూపుతో చూడకుండునట్లు తన కన్నులతో నిబంధన చేసికొని జాగ్రత్తపడెను (1వ). ప్రభువైన యేసు మత్తయి 5వ అధ్యాయములో దానిగూర్చి చెప్పుటకు 2000 సంవత్సరములకు ముందే యోబు ఈ పాపము విషయములో వెలుగు కలిగియున్నాడు. అతడు అబద్ధికుడుకాక యదార్థవంతుడై యుండెను (5,6వ). తన భార్య విషయములో ఎప్పుడైనను అపనమ్మకస్తుడుగా లేడు (9-12వ).

తన పనివారిని కనికరముతో చూచెను. బీదలకు మరియు విధవరాండ్రకు సహాయపడెను మరియు తల్లిదండ్రులు లేని వారిని తన స్వంత బిడ్డలవలె పెంచెను (16-23వ). అతడు బంగారమును నమ్ముకొనక మరియు విగ్రహారాధికుడు కాకుండా ఉండెను (24-28వ). తనను ద్వేషించినవారి నాశనమును చూచి సంతోషించలేదు (29,30వ). పరదేశులుకు ఆతిథ్యమిచ్చెను (31,32వ). అతడు పాపము చేసిన వెంటనే ఒప్పుకొనెను (33వ). ప్రజల తిరాస్కారమును గూర్చి భయపడలేదు (34వ). తన భూమినిగూర్చి జాగ్రత్తపడెను (38-40వ). తన మొఱ్ఱ ఆలకించునట్టు దేవునికి మొఱ్ఱపెట్టెను (35వ).

ఈ అధ్యాయములలో యోబు ఎంతమంచి దైవజనుడనునది చూచుచున్నాము. ఆయన జీవితములోని అనేక విషయములలో ఆయనకు వెలుగు ఉన్నది మరియు ఇతరులకు ఎంతో సహాయుడుగా ఉన్నాడు కాని ''ఆత్మీయగర్వము'' అను విషయములో ఆయనకు వెలుగులేదు. అది ఆయన భక్తిలో ఉన్న గర్వము. దేవుడు యోబును ప్రేమించెను మరియు యోబు భూమిని విడిచి వెళ్ళముందే, దీనత్వము అనే సద్గుణము కూడా కలిగియుండవలెనని దేవుడు తీర్మానించెను. యోబు యెడల తనకున్న గాఢమైన ప్రేమనుబట్టి, యోబును దైవజనుడుగాను మరియు దీనుడుగాను చేయుటకు దేవుడు యోబుకు అనేక శ్రమలను అనుమతించెను.

భక్తుడైన అపొస్తలుడైన పౌలు అత్యధికముగా గర్వించకుండునట్లు, దేవుడు పౌలును కూడా శ్రమలగుండా నడిపించెను. ఆయన శరీరములో ఒకముల్లును, తనను నలుగగొట్టుటకు సాతానుదూతగా ఉంచెను (2కొరింథీ 12:7). యోబుకు కూడా సాతాను దూత ఉండెను. అయితే అది ఎందుకు పొందుకొనెనని పౌలు ఎరిగియున్నాడు. కాని యోబు తెలియదు - దేవుడు దీనులకు మాత్రమే కృపనిచ్చును గనుక దైవజనులమీద కృపను కుమ్మరించుటకు దేవుడు వారిని దీనులుగా చేయుటకును మరియు విరుగగొట్టబడుటకును, శ్రమలద్వారా, అపార్థము చేసుకొనబడుటద్వారా, వ్యతిరేకించబడడము ద్వారా మరియు హింసింపబడుట ద్వారా నడిపించును.

యోబు ఫిర్యాదు చేయుటను మనము నిందించకూడదు. ఎందుకనగా అతనికి బైబిలులేదు. పరిశుద్ధాత్మతో నింపబడలేదు మరియు అతనికి ప్రోత్సహించే సహోదరుడు లేడు. కాని పౌలు ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు మరియు మనము కూడా చేయకూడదు.


Post a Comment

0 Comments