ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను.శిష్యులదిచూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన యెడల ఆలాగు జరుగునని. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
మత్తయి 21: 18-22
అంజూరపు చెట్టు
ఇశ్రాయేలు జాతికి సూచనగా వుంది. “అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రా యేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి”. ( హోషేయా 9:10)
అది పండ్ల కాలము కాదు
మార్కు 11:13
పండ్ల కాలము కానప్పుడు ప్రభువు పండ్లను ఎందుకు ఆశించారు? పండ్లకాలం కాని కాలంలో, కాయలు లేనందుకు, ఆ చెట్టును శపించడమెందుకు? అంటూ క్రీస్తు వ్యతిరేకులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటారు. ఆయన జ్ఞానం లేనివాడు కాదు. వాక్యభాగాన్ని అర్ధం చేసుకోలేకపోయినవారే జ్ఞానం లేనివారు. దీనికి రెండు కారణాలను చెప్తాను.
1. అంజూరపు చెట్టు ఫలించే విధానం, మిగిలిన చెట్లు ఫలించే విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంజూరపు చెట్టు మొదట కాయలు కాస్తుంది. ఆ తర్వాత ఆ కాయలను రక్షిస్తూ వాటి చుట్టూ ఆకులు పెరుగుతాయి. అంజూరపు చెట్టు ఆకులతో నిండి వుంది అంటే, ఆ చెట్టునుండి కాయలను ఆశించడం తప్పులేదు. ప్రభువు చూచిన ఆ చెట్టుకూడా ఆకులతోనే నిండివుందనే విషయాన్ని విస్మరించకూడదు.
2. సువార్తలు వ్రాయబడిన బాషామూలాలు పరిశీలించగలిగితే “అది పండ్ల కాలము కాదు” అనే అర్ధము కాకుండా, “అది పండ్ల కోతకాలము కాదు” అనే అర్ధాన్నిస్తున్నాయి. ఒకవేళ అది పండ్ల కోతకాలము అయితే, ఎవరోవచ్చి కోసుకొని వెళ్లిపోయారు అనుకోవచ్చు. అయితే, ఇంతకీ ఏమి జరిగిందంటే, అది అసలు కాయలే కాయలేదు. ఫలాలు లేకుండా ఆకులతో మాత్రం పచ్చగా వుంది.
అంజూరపు చెట్టు అనబడే ఇశ్రాయేలు జాతి, “ఆకులతో” అనగా ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలతో పచ్చగా వుందిగాని, ఆత్మీయ ఫలాలు వారిజీవితాల్లో లోపించాయి. ఆత్మ ఫలాలు లేకుంటే, ఆ చెట్టువలెనే దేవుని ఉగ్రతకు గురికావలసి వస్తుందనే ఒక ఆత్మీయమైన పాఠాన్ని ఆ చెట్టు ద్వారా ప్రభువు వారికి నేర్పించారు.
మనము శారీరిక ఇశ్రాయేలీయులము కాకున్ననూ, ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మననుండి కూడా ప్రభవు ఆశించేది ఆకులను కాదు, ఆత్మీయ జీవితాలను. లేకుంటే, “మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును”. (మత్తయి 7:19) నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును. నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీ రిప్పుడు పవిత్రులై యున్నారు. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలిం పరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును. (యోహాను 15:1-6)
ప్రభువుకు అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్తేనే గాని, ఆ చెట్టుకు ఫలములులేవని తెలియలేదా?
తెలుసు. అయితే, ఆ చెట్టు ద్వారా ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించి, వారిని విశ్వాసంలో బలపరచాలనేది ప్రభువు ఉద్దేశ్యం. ఆయన ఒక మాట మాట్లాడినాగాని, లేదా ఒక క్రియచేసినాగాని వాటిలో అనేకమైన ఆత్మీయమైన మేలులు దాగివుంటాయి. అక్షరార్ధముగా వాటిని అర్ధం చేసుకుంటే, అవి మనలను ఆత్మీయ లోతుల్లోనికి నడిపించలేవు.
దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులదిచూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన యెడల ఆలాగు జరుగునని. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
విశ్వాసముతో ప్రార్ధించినప్పుడు, అసాధ్యాలు సుసాధ్యమౌతాయని ప్రభువు శిష్యులను బలపరచుచున్నారు. అట్లా అని, మనము చూస్తుండగానే కొండ ఎగిరి సముద్రములో పడిపోతుంది అని తలంచకూడదుగాని,
ఒక చిన్నపాప రోజూ స్కూల్ కి వెళ్ళాలి అంటే? ఒక కొండను దాటి వెళ్లాల్సి వచ్చేది. అది తనకు చాలా కష్టం అనిపించేది. ఆ అమ్మాయి కూడా ఈ రీతిగానే విశ్వాసముతో ప్రార్ధించింది. ప్రభువా! ఈ కొండ వెళ్లి సముద్రంలో పడాలని.
కొన్ని రోజులకు అటువైపుగా ONGC వారు రోడ్ వెయ్యాలి అనుకున్నప్పుడు వారికి కొండ అడ్డుగా వుంది. దానిని వారు చదును భూమిగా మార్చేసారు. ఆ రీతిగా తన ప్రార్థనకు ప్రతి ఫలాన్ని పొందుకున్నది.
అవును! విశ్వాసముతో ప్రార్ధించినప్పుడు, ఏ దిక్కునుండి ప్రభువు సహాయం చేస్తారో మనకు తెలియదుగాని, ప్రార్ధనాఫలాన్ని మాత్రం తప్పక పొందగలము.
ముగింపు
మన ఆత్మీయ జీవితాలు ఎట్లా వున్నాయి? ఆకులకే పరిమితమా? చర్చికి వెళ్తున్నాను, కానుకలిస్తున్నాను, ఇది చాలులే అని సరిపెట్టుకొంటున్నామా? ప్రభువు ఆశించే “ఆత్మ ఫలాలు” ఫలించగలుగుతున్నామా? ఫలించకపోతే ఉగ్రతనుండి తప్పించుకోలేము. అది అత్యంత భయంకరం. వద్దు! సరిచేసుకుందాం! ప్రభువు ఆశించే ఆత్మఫలాలను ఫలించి, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకొందము.
ఆరీతిగా మన జీవితములను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక!ఆమెన్!
Smug christ 8341543434
0 Comments